A SHORT STORY WRITTEN BY ME IN ENGLISH, PUBLISHED IN THE MAY 2017 ISSUE OF TELUGU MAGAZINE ‘RACHANA’, TRANSLATED BY MY FATHER (ELECTRON)
హరి భారంగా అడుగులు వేసుకొంటూ వేదికనెక్కాడు. చాలా ఖరీదైన కంజీవరం పట్టు చీరలో పెళ్లి కూతురు ముస్తాబులో రేవతి అప్సరసలా ఉంది. వరుడు కృష్ణ కూడా చూడ్డానికి బాగా ఉంటాడు. కృష్ణని చూడగానే హరిలో అసూయాగ్నులు రగులుకొన్నాయి. చేతిలో తుపాకి కనక ఉంటే కాల్చిపారేద్దామన్న కోపం వెల్లుబీకింది. తనవంతు రాగానే రాని నవ్వుని బలవంతంగా తెచ్చుకొని, లోగొంతులో అభినందనలు తెలిపి బయటపడ్డాడు. విందారగించకుండా కళ్యాణమండపం విడిచి వెళ్ళాడు. తాము కలిసి చేసిన మధురసంభాషణాల్ని మరిచి, స్మృతులను చెరిపేసుకొని, రేవతి తనవైపు నిర్లక్ష్యంగా చూడ్డం హరినెంతగానో బాధించింది. కృష్ణ తన కంటే ధనవంతుడు. విద్యావంతుడు. పొడగరి. అందగాడు. రంగు చాయ ఎక్కువ. ఏ విధంగా చూసినా కృష్ణ తనకంటే అధికుడు. రేవతి తన్నుకాదని కృష్ణవైపు మొగ్గుచూపడంలో ఆమె దృష్ట్యా సమంజసమే!
ఒంటరిగా, దీనవదనంతో నిర్మానుష్యమైన చీకటి దారినిపట్టి పయనిస్తున్న హరిలో నిరాశా నిస్పృహలు ద్విగుణీకృతమైయ్యాయి. శీతాకాలపు చీకటి త్వరలోనే మరింత చిక్కబడి చలిగాలి వీచ సాగింది. హరిలో చిన్న వణుకు ప్రారంభమైంది. చిన్నగా పడ్తున్న చినుకులు చూస్తుండగానే పెద్ద వర్షంగా మారాయి. దూరంగా ఉన్న ఓ మందిరంవైపు పరుగు తీసి అందులో ప్రవేశించాడు. రేవతి చేసిన ఘనకార్యం వల్ల తనేకే మాత్రమూ విచారం లేదన్నట్లుగా ప్రత్యేకంగా ధరించిన దుస్తులు తడిసి ముద్దయ్యాయి. రేవతి తనకీ, తన ఆహార్యానికీ ఏమాత్రపు విలువనీ యివ్వలేదు. ఎదుట తను లేనట్టుగానే ప్రవర్తించింది. న్యూనతాభావం ముసురుతోందగా జేబులోంచి రుమాలు తీసుకొని మొహం తుడుచుకొన్నాడు. వర్షం పడుతోనే ఉంది. పూజారి హరిని గమనించాడు. ఏమైనా తింటావా అని ఆదరంగా అడిగాడు. విందారగించకుండా వచ్చేసిన కారణంగా ఆకలిగానే ఉంది. ఓ అరిటాకునిండా పూజారి అందించిన ప్రసాదాన్ని మారు మాట్లాడకుండా తినేశాడు.
వర్షం ఉరుములు మెరుపులతో ఉధృతమైంది. పూజారి ఓ చాపనీ, కంబళినీ యిచ్చి “యింతరాత్రి వర్షంలో ఎక్కడికి పోతావు? కాస్త యిలా మంటపం లోపలగా గర్భగుడి ద్వారానికి పక్కగా పడుకో. జల్లు పడదు,” అని గుడి వెనకవైపు ఉన్న తన యింటికి పోయాడు.
హరి పూజారిగారి మంచితనానికి జోహార్లర్పిస్తూ, ‘భగవంతుడా! నువ్వు మోసగాడివి.నాకు తీరని అన్యాయం చేశావు!’ అనుకొంటూ ఓ తిరస్కారపూర్వకమైన నమస్కారం చేసి, చాప పర్చుకొని నడుం వాల్చాడు. ఎంతసేపు పదుకొన్నాడో హరికి తెలియలేదు. ఒక పెద్ద ఉరుముతో హరికి మెలుకువ వచ్చింది.. ఎదురుగా మోహన రూపంతో, అందమైన చిరునవ్వుతో నిగనిగలాడే నల్లటి మేనుతో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని దట్టీలో ఓ వేణువు కనబద్తోంది. హఠాత్తుగా కళ్లెదుట నిలబడ్డ ఆ వ్యక్తిని చూసి హరి కంగారు పడలేదు.
“ఎవరు మీరు ?… ఒకవేళ మీరు కాని …. ?”హరి మాట ముగించ లేకపోయాడు.
“ బాగు, బాగు! నన్నే గుర్తించ లేదా? నేను దేవుణ్ణి. నాకు చాలా పేర్లే ఉన్నాయి మరి!”
ఆ వ్యక్తిలో భగవదంశాలు స్పష్టంగా కనబడుతున్నా సినిమాల్లోనూ, చందమామ పత్రికల్లోనూ చూసిన రూపానికి భిన్నంగా ఉన్నాడు. తెల్లటి ఖద్దరు లాల్చీ పైజమాలు తొడుక్కుని ఉన్నాడు. నడుంచుట్టూ ఓ తెల్లటి వస్త్రాన్ని బిగించి కట్టుకొన్నాడు. అందులోంచే వేణువు బయటకు చొచ్చుకొని కనబద్తోంది.
“మీకేం కావాలి? ” హరి అడిగాడు.
“ఇది మరీ బావుంది, నాకేం కావాలా!? నాకేవిధమైన కామనలూ, వాంఛలూ లేవు. నువ్వే ఏదో అడగదల్చుకొన్నావు. నువ్వు భగవంతుణ్ణి మోసగాడవని నిందించడం అభ్యంతరకరం! నువ్వు ఏదో వేదనలో ఆ మాటనుంటావు, అందుకని క్షమార్హుడవు. మా సమాచారం ప్రకారము నువ్వు సత్ప్రవర్తన కలవాడివి. ఆ కారణంగా నీ ఒకటి రెండు కోరికలను నెరవేర్చడానికి నిర్ణయం తీసుకోబడింది. రెండుకు మించని వరాలడుగు.”
హరి తన జీవితాన్ని వేగంగా బేరీజువేసుకొని సందేహకాత్మకంగా అన్నాడు.“నేను పక్కా అతిసామాన్యమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. ఏదో అప్పుడప్పుడూ ముష్టివాళ్ళకు ఓ రూపాయికాసు వాళ్ల జోలెలో పడేయడంకన్నా నేను ప్రత్యేకించి ఎవరికీ సహాయమూ చేయలేదు, ఎవరికీ కావాలని అపకారమూ చేయలేదు.”
“నువ్వు గత జన్మల్లో ఎన్నో దానధర్మాలుచేసి, పుణ్యకార్యాలు నిర్వహించావు. నువ్వు రెండువరాలకు అర్హుడవు, నా మాట నమ్ము!”
“నేను మిమ్మల్ని ఏమని పిలవాలి?
“ నేను చెప్పానుకదా నాకు చాలా నామధేయాలున్నాయని? కృష్ణా అని పిలు.”
“ ఆ పేరు కాదు, మిత్రా అని పిలిస్తే అభ్యంతరమా?”
“ అలాగే పిలు. మంచిపేరే తట్టింది!”
“నేను ఏదైనా అడగొచ్చా?”
“ ఆహా, దివ్యంగా!”
“ రేవతి నాదగ్గరకు తిరిగి రావొచ్చా?”
“అది సాధ్యంకాదు. దానికోసమని కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలి. అందుకు నీకు కావల్సినంత అర్హత లేదు.”
“ రేవతిని అనుక్షణమూ చూడనిదే, రేవతి లేనిదే నేను బ్రతకలేను. అందుకని ముమ్ముర్తులా రేవతిలా ఉండే అమ్మాయి నాకు కావాలి!” హరి కనుకోలుకుల్లోంచి రెండు కన్నీటి చుక్కలు రాలాయి.
“నన్నుఒక్క క్షణం ఆలోచించనీ!” మిత్రా నవ్వుతూ అన్నాడు. ఒకటి కాదు, కొన్ని క్షణాలు నుదుటిమీద వేళ్ళని పాముకుంటూ ఆలోచిస్తూ చివరికి అన్నాడు. “ రేవతిలాంటి అమ్మాయి ఉంది. కానీ ఈ భూలోకంలో కాదు. మన విశ్వానికి సమానాంతరంగా జమదగ్నమనే విశ్వముంది. అందులో విశ్వామిత్రమనే నక్షత్రమండలముంది. ఆ నక్షత్రమండలంలో భాస్కర అనే నక్షత్రగ్రహకుటమిలో వసుధ అనే గ్రహంలో రేవతిలాంటి అమ్మాయి అతికష్టం మీద నా దృష్టిలోకి వచ్చింది మరి! ఏమంటావు?”
“ అంతదూరం గ్రహాంతరయానం చెయ్యాలా? మన ఈ భూలోకంలో ఎవరూ లేరా?”
“రేవతి పోలికలు గల వ్యక్తులు కొంతమంది లేకపోలేరు. కానీ అచ్చు రేవతిలాంటి అమ్మాయే కావాలంటే గ్రహాంత రాయనం కాదు నేను చెప్పిన విశ్వాంతరయానం చెయ్యాలి.”
“అంటే చాలా విశ్వాలున్నాయా? ఇంతవరకు ఉన్నదంతా కేవలం ఒకటే విశ్వమన్నభ్రమలో ఉన్నాను.”
“ విశ్వాల సంఖ్యకూడా అనంతమే. నేను చెప్పిన ఈ విశ్వం వాస్తవానికి మనకి కొన్ని అంగుళాల దూరంలోనే ఉంది. కానీ అది మన కంటికి కనిపించదు.”
“ వాటిని ఎవరు నియంత్రణలో ఉంచుతారు?”
“ప్రతి విశ్వానికీ ఒక సృష్టికర్తా, రక్షకుడూ, లయకారుడూ ఉంటారు.
“ మనం వాళ్ళని ఎందుకు చూడలేం? ఇంతకీ మీరు ఏ కోవకి చెందుతారు?”
మిత్రా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. “ అనంతమైన సంఖ్యలో ఉన్న సమానాంతర విశ్వాలు ఒకదానిమీద మరొకటి పొరలుపొరలుగా పేర్చబడి ఉన్నా కాంతి ఒకవిశ్వంనుంచి మరొక విశ్వానికి ప్రసరించలేదు. కానీ గురుత్వాకర్షణ శక్తి అనునిత్యమూ అనంతవిశ్వాలమధ్య ప్రభావం చూపుతోనే ఉంటుంది. ఆ శక్తిని విశ్లేషించే మరో రేవతి ఉనికిని గ్రహించాను. వృధాప్రసంగాలతో కాలయాపన ఎందుకు? కార్యోన్ముఖులౌదాం పద !”
ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రచండ మారుతం వీచింది. అధ్భుతమైన మెరుపు మెరిసింది. హరి అధునాతనమైన ఓ ఫలహార శాలలోలో ఉన్నాడు. ఒక్కసారి మనసు భీతావహమైనా పక్కనే నిలబడిఉన్న మిత్రాని చూసి ధైర్యం వహించాడు. రేవతి ఓ బల్లవద్ద కూర్చుని ఉంది. మనసు ఆనందోద్రేకాలతో ఉన్నత పర్వత శిఖరాలని తాకింది. కానీ మరుక్షణంలో ఒక్కసారిగా నీరసించిపోయాడు. ఆమె దర్జాగా ధూమపానం చేస్తోంది. భూమిలోని రేవతికి ధూమపానపు పొగన్నాకూడా ససేమిరా ఇష్టం లేదు! ఆలోచనలు ఆపి ఆమెను కలుసుకోడానికి ఒక అడుగు వేద్దామనుకొనేలోగా మిత్రా చెయ్యిపట్టుకొని అపాడు.
“ తెలివి తక్కువగా ప్రవర్తించకు. ఈ వసుధ రేవతికి నువ్వు ఎవరో తెలియదు. పరిచయంచేసే ఏర్పాటు చెయ్యనీ!”
మిత్రా పక్కన అంతటి మోహనరూపుడూ అయిన మరో వ్యక్తి ప్రత్యక్షమైయ్యాడు.
“ఈయన విష్ణు. జమదగ్ని విశ్వానికి నియమితుడైన రక్షకుడు.
హరి వినమ్రుదై నమస్కరించాడు. “నాపేరు హరి,” అన్నాడు.
విష్ణు రేవతి బల్ల వద్దకు వెళ్ళి ఓ అరక్షణం ఏవో రెండు మాటలు మాట్లాడి, హరిని రమ్మన్నట్టుగా సైగ చేశాడు. హరి అడుగులో అడుగువేసుకొంటూ రేవతి కూర్చున్న బల్లని సమీపించాడు. విష్ణు రూపంలో మార్పు కనపడింది. ఆయనలో రేవతి పోలికలు లీలగా పొడగట్టాయి! హరి దరి జేరగానే విష్ణు వారిని వదిలి వెళ్లిపోయాడు.
రేవతి కూర్చోమన్నట్టుగా చూసింది. హరి బిడియపడుతూ కుర్చీలో కూర్చున్నాడు.
“నా తాతగారు మీరు నాతో మాట్లాడాలనుకొంటున్నారని చెప్పారు,” అందామె. విష్ణు రూపం మార్చడంలోని రహస్యం తెలిసింది. హరి రేవతితో అక్కడి కాలమానం ప్రకారం ఓ గంట మాట్లాడాడు. అంతసేపూ మిత్రా ఫలహారశాల బయట హరి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. హరి అన్యమనస్కంగా బయటకు అడుగుపెట్టి, మిత్రాని సమీపించి తల అడ్డంగా ఆడించాడు.
“ఏమైంది? సంతోషంగా కనబడటల్లేదు!” మిత్రా అడిగాడు.
“ఏమని చెప్పను?” ఏడుపుగొంతుతో అన్నాడు హరి.
“పర్వాలేదు, ఏం జరిగిందీ నిస్సంకోచంగా చెప్పు.”
“ఈమె నాకు తెలిసిన రేవతి కాదు. ధూమపానం చేస్తుంది. మద్యపానం చేస్తుంది. ఈ వసుధలోని ఓ అథోజగతినాయకుడి కూతురు. నాతో మాట్లాడుతున్న సమయంలో చరవాణి లో రెండుసార్లు ఎవరితోనే మాట్లాడి యిద్దర్ని లేవగొట్టేయమంది. నాకు వెన్నులోంచి చలి మొదలైంది!”
“నువ్వు సరిగా రేవతిలా కనబడే అమ్మాయే కావాలన్నావు. చూపించాను. యిప్పుడు చూస్తే బెదిరిపోతున్నావు!”
“అయ్యుండొచ్చు. కానీ ఇలాంటి క్రూరమైన మనస్తత్వం కలదానిని కాదు. నాకు క్రూరత్వమన్నా, హింసన్నా అస్సలు ఇష్టం లేదు. భౌతిక రూపంలో ఒకేలా ఉన్నాయిద్దరూ వేరు! ఎందుకని?” హరి ప్రశ్నించాడు.
“నువ్వు ప్రేమించిన రేవతి నిన్నుకాదన్న సంగతి మరిచినట్లున్నావు?”
“ కాదనను. కానీ ఈ హంతకురాలికంటే చాలారెట్లు నయం!”
“ భౌతికదేహం కోట్లాది కణాలతోనూ, ఒక్కొక్కకణం అనేక పరమాణువులతోనూ నిర్మితం. చివరికి తేలేదేమిటంటే కోటానుకోట్ల పరమాణువుల సమ్మేళనావిధానంలోని చిన్నపాటి వైరుధ్యాలు సమస్త చరాచర జీవుల వివిధ భౌతిక రూపాలకీ, మనస్తత్వాలకి కారణం. కార్తికేయమనే మరోవిశ్వం లోని ఓ నక్షత్ర మండలంలోని ఆదిత్య నక్షత్ర గ్రహకూటమిలోని గిరిస్తని అనే గ్రహంలో మరో రేవతి ఉంది. కానీ ఆమె వివాహితురాలు! ఆమెను నువ్వు ఆశించకూడదు.”
“ అయితే యింతకాలమూ నేను అభిమానించినదెవర్ని? మీరు చూస్తే అన్నీ, అందరూ పరమాణువుల పుట్టలంటున్నారు?”
“అనంత విశ్వాలు సృష్టించబడినప్పట్నుంచి ఈ పరమాణువుల సంఖ్య స్థిరంగా ఉంది. మార్పు లేదు. కానీ వాటి చలనంలో స్థిరత్వం లేదు. బహుచంచల స్వభావం కలవి. విడిపోతూంటాయి, కలుస్తోంటాయి. రకరకాల ఆకృతులకి ఇటికలుగా పనిచేస్తాయి. ఓ కొంగముక్కులోని పరమాణువులు ఆ కొంగ పోయిన తర్వాత ఓ ప్రసిద్ధ చలనచిత్ర తార నాసికను రూపొందించవచ్చు! నీ చేతివేళ్ళ చివరల్లోని లోని పరమాణువులు బహుశా ఓ ఆస్ట్రేలియా వరాహం తాలూకు మూత్రపిండాల్లోంచి వచ్చిఉండొచ్చు!”
“ ఛీ! వినడానికి, నమ్మడానికి మనసొప్పటల్లేడు. నిజమేనంటావా?”
“ఆహా! దివ్యంగా!”
“ అయితే ఈ పరమాణు సమూహాలపట్ల నేను విముఖుణ్ణి! అవంటే నాకు యిప్పుడు ఇష్టం లేదు! ఎందుకంటే అవి …….”
“ అవి స్థిరంలేని కెరటాల లాంటివి, అందుకేనా?”
“కావొచ్చు! యిప్పుడు నాకేం కావాలో అర్థమౌతోంది. సరిగా రేవతిలా ఆలోచించే వ్యక్తిని నాకివ్వగలవా? బహుశా ఆమె మనసుని నేను ప్రేమించాననుకొంటా? పువ్వులని చూసి అందంగా పోటీపద్తూ నవ్వేది. కవిత్వమంటే చెవికోసుకొనేది, పేదలంటే కనికరం చూపేది. బహుశా పేదలపట్ల నా చిన్నపాటి నిర్లక్ష్యధోరణి ఆమెకు ఇష్టంలేకపోయి ఉండొచ్చు!”
“ఖచ్చితంగా యిదే నీ కోరికా ? ఆలోచించుకో.”
“ ఆహా, ఖచ్చితంగా యిదే నా ఆఖరి నిర్ణయం. నేను ప్రేమించి పొందలేని రేవతిలా ఆలోచించే వారు కావాలి! ”
“ సరే మన విశ్వంలోని భూమికే పోదాం. ఎవరో ఒకరు దొరకవచ్చు. ”
“పరాయి సమానాంతర విశ్వాల అన్వేషణ చాలు. ఇలాంటి అన్వేషణలో నాలాంటి వ్యక్తి తారసపడితే లేనిపోని చికాకులు కలుగుతాయి. తాలూకా దాటి సంబంధాలు మా నాయనమ్మకి ఇష్టంగా ఉండేవికావు. మీరన్నట్టుగానే మన భూమిలోనే ఎవరైనా దొరికితే ప్రాణానికి హాయిగా ఉంటుంది.”
“నువ్వన్న మాటలో వాస్తవం లేకపోలేదు. పద, మన భూమీకే తిరిగి పోదాం!” అన్నాడు మిత్రా.
మరో ప్రభంజనం. మరో మెరుపు. యిద్దరూ వచ్చి భూమిమీద వాలారు. స్వంత విశ్వంలో అడుగుపెట్టిన హరికి ప్రాణం లేచి వచ్చింది. “మరిప్పుఢేమిటి సంగతి ?” హరి ప్రశ్నించాడు.
“ఇక్కదో చిన్నపాటి చికాకుంది. రేవతిలాంటి భావసారూప్యమున్న వ్యక్తి కావాలంటున్నావు. నాకు నలుగురు దృష్టిలోకి వచ్చారు. ఒకరితర్వాత ఒకరి మనసులతో నీ మనసుని తాదాత్మ్యం చేస్తాను. ఎవరి మనసుని చివరికి నువ్వు ఎంపిక చేసుకుంటావో ఆ మనిషిని భౌతికరూపంలో చూడగలుగుతావు.”
“మీరు చెప్పింది బావుంది. నాకిప్పుడు శరీరాకృతీ, ముఖారవిందమూ ముఖ్యంకాదు. మనసు ముఖ్యం.”
“నాలుగు రోజుల తర్వాత నిన్ను బయటకు లాగుతాను. ఆ లోపుగా రోజుకో మనసును తెలుసుకొని విశ్లేషణ చేసుకో.”
“నాలుగు రోజులు నా సమయాన్ని ఈ విషయమై కేటాయించాలా? మీకు సమయం విలువ తెలియదనుకొంటాను! ”
“మాకు సమయమనేదే లేదు. వయసు పెరగడమనేదీలేదు. నేను నిత్యప్రకాశితుణ్ణి.”
“ దూరం పెరిగినకొద్ది కాంతి క్షీణిస్తుందికదా?” హరి ఏదో అనాలని అనేశాడు.
“కాంతి మూలంలో ఉధృతి అంతే ఉన్నా మనిషి దూరం జరిగినకొద్దీ కాంతి పల్చబద్తుంది. యిది ప్రకృతి సూత్రం. లేకపోతే సూర్యుడి కాంతికీ, వేడికీ గ్రహాలన్నీఎప్పుడో మాడి మసయిపోయేవి. నా సమయం మాటటుంచి నీ ధ్యేయం సంగతీ, దానికి కావాల్సిన సమయం సంగతి ఆలోచించుకో. అనవసరంగా కాలయాపన చేసుకుంటున్నావు!”
హరి మిత్రా సూచించిన ఆ నాలుగు మనసులతోనూ ఒక్కోరోజు గడిపి అయిదో రోజున గుడి బయట నున్న ఓ రావిచెట్టుకింద వేణువు వాయిస్తూ ఉన్న మిత్రాని కలుసుకొన్నాడు. హరిని చూడగానే మిత్రా వేణువుని ఊదడం అపి ఏమైందన్నట్టుగా చూశాడు.
“నాకంతా అయోమయంగా ఉంది! మనసులను అర్థం చేసుకోవడం చాలాచాలా కష్టం! అసలు మనసంటేఏమిటి?” హరి ఒగురుస్తూ అడిగాడు.
“నువ్వు నన్ను చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగావు. సమాధానం నువ్వేచెప్పాలి! ఏం జరిగిందో చెప్తే సమాధానం దొరకొచ్చు”
‘’నలుగురికీ పువ్వులంటే ఇష్టమే. ఒకరికి పువ్వుల్ని కోయడం ఇష్టంలేదు. మరొకరికి మాలకట్టి తలలో ముడుచుకోవడం ఇష్టం. ఇంకొకరికి దేముడి మెడలో వెయ్యడం ఇష్టం. మరొకరికి నీళ్ళతోట్టెలో వేసి స్నానం చెయ్యడం ఇష్టం! ఒకరు పేదవారికి డబ్బులిస్తారు. ఇంకొకరు తిండి పెడ్తారు. మరొకరు పనిచేయించుకొని కూలి యిచ్చి పంపుతారు. ఒకరు ఆదరంగా మాట్లాడి బిచ్చమెత్తడం మంచిదికాదని సలహా యిచ్చి పంపుతారు.. ఒకరికి ప్రేమగీతాలిష్టం. మరొకరికి సమాజాన్ని చీల్చి చండాడే విమర్శనాత్మక కవిత్వమంటే చెవికోసుకొనేటంతటి ఇష్టం. ఒకరికి భావకవిత్వం, మరొకరికి భక్తిగీతాలు ఇష్టం. నా మనసులోని ఆలోచనలు కూడా నిలకడ లేకుండా క్షణక్షణానికీ మారిపోతున్నాయి. ప్రేమమందిరం తాజ్ మహల్-భక్తినిలయం రామమందిరం. పల్లెలో వ్యవసాయం-అయిదునక్షత్రాల హోటల్లో వంట చెయ్యడం. ఒకవిషయంనుంచి మరో విషయమ్మీదకు ఆలోచనలు శరవేగంతో మళ్లిపోతున్నాయి. ఒక ఘడియ చెన్నై కుంభవృష్టిని గురించి భయమేస్తే మరోఘడియ నేపాల్ భూకంపం గురించి- శ్వేతసౌధంలోని నల్ల అధ్యక్షుడినుంచి, ఏంచేసినా, ఏంచేద్దామనుకొన్నా అపనిందలు పాలయ్యే పాపాల భైరవుడు మోడీ వరకూ- ఇవేకాక ఎన్నో పాడు ఆలోచనలు-ఎందరెందరో సుందరీమణులకన్నా రేవతి అందకత్తా?-అందంగా ఉండేవారి మనసులుకూడ అందంగా ఉంటాయా?- అంతా అయోమయం, గందరగోళంలా తయారైంది. యింతకీ నేను వలచిన రేవతి లాంటి వ్యక్తి ఎవరో నాకు తెలియటల్లేదు!”
మిత్రా నవ్వి అన్నాడు. “ పోనీ ఆ మనసులికి ఆహార్యమిచ్చిన నలుగురి భౌతికరూపలూ ఎలా ఉంటాయో ఓ సారి చూద్దామా? అప్పుడు నువ్వు ఓ నిర్ణయం తీసుకోవచ్చు.”
హరి తల ఊపాడు. వారికి కొద్ది అడుగుల దూరంలో ఒక్కొక్కరూ కనబడసాగారు. మొదటి వ్యక్తి మధ్య వయస్కుడైన ఓ పశువైద్యుడు! హరి అదిరిపోయాడు. “ ఇదెలా సాధ్యం?”
“నువ్వు గ్రహించలేని సత్యమిది. చాలా ఆలోచనలకి, దృక్పథాలకీ లింగబేధం లేదు. స్త్రీలలోనూ, పురుషులలోనూ పరస్పరమూ, లేదా విడివిడిగా ఒకేరకమైన భావజాలం ఉండడంలో ఆశ్చర్యం లేదు.”
“హే భగవన్ ! నేను నా జీవితం ఓ స్త్రీతో గడపదల్చుకొన్నాకాని యిలా వికటధోరణిలో కాదు!” హరి బాధాకరంగా అన్నాడు.
“ఎందుకలా గింజుకుంటావు? స్వలింగ వివాహాలు మీ నూతన సమాజానికి వింతకాదు కదా?”
రెండవ వ్యక్తి ఒక చైనా దేశపు వయసుమీరిన యిల్లాలు. మూడవ వ్యక్తీ రష్యాలోని ఓ నడి వయస్కురాలైన వంట మనిషి.. చాలా భారీగా ఉంది.
“ భగవంతుడా! మన దేశవాసురాలూ, నా భాష మాట్లాడేది ఎవరూ లేరా? ”
“కంగారెందుకు? యింకా ఒకరు మిగిలి ఉన్నారుగా?”
నాలుగో వ్యక్తి హరి ఈడుదే. నాజూగ్గా ఉంది. అందగత్తె కాదు కాని చూడ ముచ్చటగా ఉంది.
“ఈమె ఎవరు?” హరి కుతూహలంగా అడిగాడు.
“ మీ జిల్లావాసురాలే. ఓ చర్చి ప్రీస్ట్ కూతురు.”
“ఆమె నా మతస్తురాలు కాదు. నాకు నా మతమేకాక నా కులంలోని స్త్రీ కావాలి.”
మిత్రా హరి తలమీద చూపుడువేలుతో ఓ చిన్న దెబ్బ వేశాడు. “నీకేం కావాలో స్పష్టగా ఆలోచించుకోడానికి మరో అవకాశమిస్తున్నాను. రేవతి రూపమున్న యువతిని పరిచయం చేస్తే భావ సారూప్యతలేదనీ, భావసారూప్యమున్న నలుగురి మనసుల్ని నీకు పరిచయం చేస్తే వారిని భౌగోళిక, సామాజిక కారణాలు చెప్పి తిరస్కరించావు. నీకేం కావాలో నీ మేధకి అందటల్లేదు!”
హరి చేతులెత్తేశాడు. “నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఈ మనసనేది ఏమిటి? ఈ మేధ అనేది ఏమిటి ? ఈ రెండూ నా ప్రేమకు రూపాన్నివ్వలేవు!”
మిత్రా జాలిగా అన్నాడు.” నిజమే! మనస్సుకీ, మేధస్సుకీ మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని గుర్తెరగక చాలామంది వేదాంతులూ, తార్కికులు అయోమయంలో పడిపోయారు. ఈ రెండూ మనిషి వ్యక్తిత్వాన్ని నిగ్గుదేలుస్తాయి. ఇష్టత- అయిష్టత, సహనం-అసహనం, ప్రేమ-అసహ్యం, కోపం,అసూయ, అవమానం, అహం, గౌరవం, దురాశ, కామం -యిలా ఎన్నో గుణవిశేషాలూ, భావోద్రేకాలూ మనిషి మనసుని సదా ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటాయి. యిలా ఎన్నో విశేషాల రకరకాల కలబోతలు ఏ యిద్దరు వ్యక్తుల ఆలోచనల్ని ఒకే విధంగా ఉండనీయవు.”
“మెదడు నిర్మాణంలో కూడా ఒకే రకమైన పరమాణువులున్నప్పుడు యింతటి అయోమయస్థితి ఎందుకుండాలి? ”
“వాస్తవానికి దేహానిర్మాణంలో ఉన్న పరమాణువుల లాంటివే మెదడులోకూడా ఉన్నాయి. కానైతే మెదడు నిర్మాణంలో పాలుపంచుకొన్న పరమాణువులు ఒక పద్ధతిలో లంకెలు వేసుకొని తమ్ముగురించి తాము తెలుసుకొనే ప్రగతిని సాధించాయి. మెదడు భౌతికమైతే మేథస్సు గ్రహణ శక్తి. భావానికి ఆధారం. కానైతే పరమాణువుల మౌలికమైన చపలత్వం భావంమీద తన ప్రభావాన్ని చూపుతుంది. అందుకనే ఏ యిద్దరు వ్యక్తుల మనోభావాలు పూర్తిగా ఒకేలా ఉండవు! అంతేకాదు, ఒకేవ్యక్తి మనోభావాలు అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండవు!”
మిత్రా ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు.“ఏదో విషయంలో కోపంగా ఉన్నా, కోటిరూపాయల అదృష్టం వరించిందని వినగానే మనిషి, ఆ కోపాన్ని వెంటనే మరిచి పోతాడు. భార్యతో జగడమాడి చిరాగ్గా ఉన్న భర్త, పై అధికారి తన పని తీరుని మెచ్చుకున్నప్పుడు ఆ చిరాకుని మర్చిపోతాడు. మనసు యింతటి చంచలమైనది.”
హరి నెమ్మదిగా అన్నాడు. “భౌతికరూపం వయసుతోబాటు నెమ్మదినెమ్మదిగా మారుతుంది. మనసు క్షణక్షణానికి మారిపోతుంది. ఈ రెండింటిలో నేను ప్రేమించేదేవర్ని?”
“మనమిప్పుడు దారిలో పడ్తున్నాం అవునా?”
“ నేను యితరులలో ప్రేమించేదేమిటి? ముఖ్యంగా నాలోని ఏమిటి ప్రేమిస్తుంది?”
“మౌనంగా ఉండు. నిశ్చలంగా ఉండు. మనస్సుని ఆలోచన రహితంగా చెయ్యి.” మిత్రా ఆజాఞపించాడు.
హరి చిత్రంగా మిత్రా చెప్పినట్టుగానే చేశాడు. ఎంతసేపో హరికే గుర్తు లేదు. అతని దేహం నెమ్మదిగా దూదిపింజెల్లా విడిపోసాగింది. తను మోస్తున్నభారాలు, తనచుట్టూ పేరుకొన్న భవబంధాలు-తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఉద్యోగం, కూడబెట్టిన సొమ్ము, యిల్లు, ఊరు, దేశం., ప్రపంచం అన్నీ చేతనలోంచి అదృశ్యమవసాగాయి. వాసనలు కలిగించే ప్రపంచం లేనప్పుడు మనసు నిశ్చలత్వాన్ని సాధించింది. అద్భుతమైన బ్రహ్మానందంలో, ఎటుచూసినా నిష్కామమైన ప్రేమతరంగాలలో మనసు తేలియాడసాగింది. రేవతి దేహాన్ని,మెదడునీ ప్రపంచంనుంచి వేరుచేసి విశ్లేషిస్తే ఆమెకూడా ఆ బ్రహ్మానంద సాగరంలో విడదీయలేని అంశంగా విలీనమైపోయింది. యిప్పుడు తనెవరు? రేవతి ఎవరు ?
“ యింతవరకు నన్ను నేను ప్రేమించూ కుంటూ వచ్చాను. వాస్తవానికి ప్రేమను ప్రేమించదమే ప్రేమ!”
హరి గట్టిగా అరిచాడు.
“మరి రేవతి సంగతి?”
“ఆమె సంతోషంగా ఉంది. అలాగే ఉండనివ్వడం మంచిది. నుదుటిన రాసి ఉంటే మరో రేవతి లభించకపోదు. అలా జరగకపోయినా పర్వాలేదు! అవునూ, యింతకీ మీరెవరు?”
మిత్రా నవ్వుతూ ఒక్కసారిగా అవులించాడు. అఖిలాండ బ్రహ్మాండాలన్నీ ఆ నోటిలో కనిపించాయి. హరి కాస్సేపు స్తబ్ధుడైపోయాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. “మీరెవరు? నేనేవరు? మీరే నేను, నేనే మీరు!”
“ యుగయుగాలనుండి ఇదే సత్యం. ఇప్పుడే నీ గ్రహింపుకు వచ్చింది, సంతోషం!” మిత్రా అదృశ్యుడైపోయాడు.
హరి కళ్ళు నులుముకొని లేచాడు. పరిసరాలు గమనించాడు. తను నిన్న రాత్రి పదుకొన్న మందిరమే. బయట భానుడు ఆకాశంలోకి అప్పుడే అరుణకాంతులను విరజిమ్మసాగాడు. ‘ ఇదంతా కలా?! నిజంగానే జరిగినట్టుగా ఉంది!’ అనుకొన్నాడు. పూజారిగారు ప్రభాత సేవ చేస్తున్నాడు. హరి దేవుడికి నమస్కారం చేసి, ఆయనకి ధన్యవాదాలు తెలుపుకొని, మందిరం వదిలాడు. హరిమనసులో రేవతినిగురించిన ఆలోచనలు లేవు. అనంత ప్రేమతత్వాన్ని ఆకళింపుచేసుకొన్న యోగిలా అడుగులు వేయసాగాడు.
***
సంపాదకుని వ్యాఖ్య:
ఓ కుటుంబంలోని పద్దవారు రచయితలైతే వారి కుమారులు తండ్రి రచనలకు సార్థకత కల్పించాలని ఆంగ్లానువాదంచేసి ప్రచురించడం గురించి మనకు తెలుసు.
డా. పింగళి గోపాల్ గారు చాలాకాలం ఇంగ్లాండ్లో ఉన్న కారణంగానో, లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఆంగ్లంలో ఓ కథ రాయగా ఆయన తండ్రిగారు దాన్ని తెలుగీకరించి ప్రచురణకు పంపేరు.
అద్వైతం కథావస్తువు భారతీయ సంస్కృతికి ప్రతీక. కథ నడిపిన తీరు ప్రశంసనీయం.
తండ్రి స్వతహాగా మంచి రచయిత ఐన కారణంగా అనువాదం సాఫీగా, చదవ చక్కగా సాగింది.
రచయితలైన తండ్రీ కొడుకులకు మా అభినందనలు.
సంపాదకుడు.